పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోతీ కే డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయం వద్ద నెలకొన్న తీవ్ర నీటి సమస్య మరియు వీధిదీపాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి సుమారు మూడు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యుడు ఎస్ మహిపాల్ మాట్లాడుతూ హోతీ కే డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసిస్తున్న పేద ప్రజలు త్రాగునీరు లేక మరియు రాత్రి వేళల్లో వీధిదీపాలు వెలగక చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆందోళనతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్ తక్షణమే స్పందించి నిరసనకారులతో మాట్లాడారు. రేపటి లోగా బోర్ మోటార్ మరమ్మతులు చేయించి నీటి సమస్యను తీరుస్తామని మరియు ఎల్లుండి లోగా వీధిదీపాల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ సంబంధిత మున్సిపల్ అధికారులను క్షేత్రస్థాయిలోనే ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన రాతపూర్వక హామీతో సంతృప్తి చెందిన నిరసనకారులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈ సందర్భంగా ఎస్ మహిపాల్ మాట్లాడుతూ చైర్మన్ ఇచ్చిన హామీ గడువు లోగా అమలు కాకుంటే లబ్ధిదారులను మరియు ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం వేదికగా మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.