101 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణం – వెంటనే చర్యలు తీసుకోవాలి

పయనించే సూర్యుడు, మే 28 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎం కుమార్ మియాపూర్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్‌కు ఆనుకుని, రాగులకుంట చెరువు పైభాగంలో ఉన్న 101 సర్వే నంబర్‌లో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆరు అంతస్తుల భవన నిర్మాణం చేపడు తున్నారని ఎం సిపిఐయు సహాయ కార్యదర్శి పల్లె మురళి ఆరోపించారు. సంబంధిత భూమికి చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు లేవని, వారు నకిలీ డాక్యుమెంట్లు చూపించి అను మతులు పొందినట్లు ఆరోపించారు. అదేవిధంగా, దీప్తి శ్రీ నగర్ ఆమోదిత లేఔట్‌లో ఆ స్థలం ప్రభుత్వ భూమిగా స్పష్టంగా పేర్కొనబడిందని, దీనికి సంబంధించిన లేఔట్ కాపీలను అధికారులకు సమర్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అనధికార నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజా ఆస్తులు, చెరువు పరిసరాలు మరియు ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి మియాపూర్ సర్కిల్-48 డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శేషి రేఖకి, ఏసిపి టౌన్ ప్లానింగ్ శ్రీమతి రాణికి ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు.అలాగే శేరి లింగంపల్లి డిప్యూటీ తాసిల్దార్ మహి పాల్ రెడ్డిని కలిసి సమస్యను వివరిం చడం జరిగిందని తెలిపారు. సంబం ధిత భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నా లపై పూర్తి వివరాలు తెలియజేయగా, ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే స్థల పరిశీలన నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు తెలిపారు.

అధికారులు వెంటనే స్థల పరిశీలన నిర్వహించి:

అక్రమ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని,

అనధికార భవనాన్ని కూల్చివేసి ప్రభుత్వ భూమిని రక్షించాలని,

బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను హైడ్రా కమిషనర్, రాజేంద్రనగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి ఎమ్మార్వో శేరిలింగంపల్లి జోన్ కమి షనర్, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు కూడా పంపినట్లు తెలిపారు.