పయనించే సూర్యుడు,కోరుట్ల, మే 23 కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును కోరుట్ల పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఘటనలో దొంగిలించిన నగదు, సెల్‌ఫోన్‌తో పాటు కొనుగోలు చేసిన బైకు కూడా స్వాధీనం చేసుకొని నిందితుడిని జువెనైల్ జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్ గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రీను ఈ నెల 17న తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన ప్రకాశం జిల్లాకు పెళ్లి కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోగా ఇంటి తాళాలు పగులగొట్టబడి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాలో దాచిన రూ.4 లక్షల నగదు, రూ.20 వేల విలువైన సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో వెంటనే కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసిన కోరుట్ల పోలీసులు, సీఐ కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సై ఎం. చిరంజీవి, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన బృందం సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలను పరిశీలిస్తూ రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, దర్యాప్తులో నిందితుడు నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడిగా తేలింది. గతంలో అతడు ఫిర్యాదుదారుడు తమ్మిశెట్టి శ్రీను వద్ద పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన స్నేహితుడుఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేయడంతో తానూ ఎలాగైనా బైక్ కొనాలని భావించి, జల్సాలకు అలవాటు పడటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన రూ.1.65 లక్షల విలువైన యమహా మీ-15 బైక్, రూ.1.80 లక్షల నగదు, రూ.20 వేల విలువైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జువెనైల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన కానిస్టేబుళ్లు పురుషోత్తం, గట్టు శ్రీనులను డీఎస్పీ రాములు నగదు బహుమతితో అభినందించారు. అలాగే కేసు విచారణలో కీలకపాత్ర పోషించిన సీఐ లక్ష్మీనారాయణ, ఎస్పైచిరంజీవిలను ప్రత్యేకంగా ప్రశంసించారు.