02 Nov 2026 | 11:44 PM

55 ఏళ్ల వయస్సులో అరుదైన ఘనత.. నాగర్‌కర్నూల్ జిల్లాకు గర్వకారణం

మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, పతకం అందజేత

పయనించే సూర్యుడు నవంబర్ 3 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ వయస్సు అనేది విజయానికి అడ్డంకి కాదని నిరూపిస్తూ 55 ఏళ్ల వయస్సులో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన తేప్ప శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నుంచి అరుదైన గౌరవం లభించింది. నాగర్‌కర్నూల్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు ప్రశంసా పత్రం, పతకాన్ని అందజేసి అభినందించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి శ్రీనివాస్ ఈ ఘనత సాధించారు. గత 35 ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతర సాధన చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. క్రీడలతో పాటు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. గత 16 ఏళ్లుగా లయన్స్ క్లబ్‌తో పాటు పలు సేవా సంస్థల ద్వారా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతిరోజూ కనీసం గంటపాటు వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు.
తేప్ప శ్రీనివాస్ సాధించిన గిన్నిస్ ప్రపంచ రికార్డు నాగర్‌కర్నూల్ జిల్లాకు గర్వకారణమని తైక్వాండో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.