పయనించే సూర్యుడు న్యూస్, జూలై 7 – సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలంలో కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేసి ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, కే. నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ, సింగరేణి మండలంలో తరచూ జరుగుతున్న అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వర్షాకాలంలో ఉక్కపోత, దోమల బెడద, కోతుల సమస్యల తో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, గంటల తరబడి కొనసాగుతున్న విద్యుత్ అంతరాయాలు ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని అన్నారు. అనావృష్టి పరిస్థితుల కారణంగా రైతులు పంటలను కాపాడుకునేందుకు మోటార్లు నడపాల్సిన సమయంలో విద్యుత్ అందక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఉరిమితే కరెంటు కోత.. మెరుపు మెరిస్తే కరెంటు కోత.. గాలి వీచినా కరెంటు కోత.. చినుకు పడినా కరెంటు కోత” అనే పరిస్థితి మండలంలో నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలు గంటల తరబడి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి మండలంలో లైన్‌మెన్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉండటం, ఉన్న ఫోర్‌మెన్‌లు వయోభారంతో విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో విద్యుత్ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అప్రకటిత విద్యుత్ కోతలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు వజ్జ రామారావు, మాజీ సర్పంచ్ బానోత్ బన్సీలాల్, పార్టీ సీనియర్ నాయకులు తలారి దేవప్రకాశ్, నాయకులు ఆదర్ల వినయ్ కుమార్, చిలుముల భరత్, జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.