జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీఎల్ఏ ఓటరు జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పణ

పయనించే సూర్యుడు, మే 22 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో మాజీ మంత్రి, జహీరాబాద్ ఇంచార్జ్ డా|| ఏ. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని సంబంధిత పోలింగ్ కేంద్రాలు మరియు ప్రాంతాలకు సంబంధించిన బూత్ స్థాయి ప్రతినిధుల (బీఎల్ఏ) జాబితాను రెవెన్యూ డివిజన్ ఎన్నికల అధికారికి సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ జాబితాను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డా|| ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల ఓట్లు తొలగించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా, పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కావాలని కోరారు. నకిలీ మరియు అనర్హత ఓట్ల తొలగింపులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా కీలకమని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కండేం నర్సింలు, మొగుడంపల్లి మండల అధ్యక్షుడు మాక్సూద్ అహ్మద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామెల్, మాజీ వైస్ చైర్మన్ ఖాజా, టీపీసీసీ సమన్వయకర్త గౌస్, కౌన్సిలర్ మహేష్, సర్పంచ్ రాజు, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హుగ్గేల్లి రాములు, నాయిమ్, మొయిజ్, గౌస్, ఆయుబ్, అడ్వకేట్ వాజహత్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *