( పయనించే సూర్యుడు మే 23 రాజేష్ దౌల్తాబాద్ ) రాయపోల్ మండలం రామారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో “కనువిప్పు” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాయపోల్ ఎస్సై మానస ఆధ్వర్యంలో, సిద్దిపేట కళాబృందం సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ మోసగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాకారులు పాటలు, నాటికలు, సందేశాత్మక ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, ఆధార్ సమాచారం ఇతరులకు తెలియజేయకూడదని, అపరిచిత లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. అలాగే రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని కళాజాత రూపంలో వివరించారు. చిన్నపిల్లలు, యువత, మహిళలు సైతం ఆసక్తిగా కార్యక్రమాన్ని వీక్షించి కళాకారుల సందేశాలను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై మానస మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. గ్రామస్థులు కూడా పోలీసుల అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన ఇవ్వడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీస్ సిబ్బంది, కళాబృందం సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం సందేశాత్మకంగా, ఆలోచింపజేసేలా సాగి ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చింది