గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ

* పెండింగ్ వేతనాలు చెల్లించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ * కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మండల అధ్యక్షులు యశ్వంత్

పయనించే సూర్యుడు జూన్ 2 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బిజినపల్లి మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కథలప్ప, ఎంపీఓ విశాల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులు దశాబ్దాలుగా గ్రామాల్లో మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్ సేవలు, డంపింగ్ యార్డ్ నిర్వహణ వంటి కీలక పనులు చేస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నారని, కనీస వేతనాల అమలు ఇంకా జరగకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాన్ని రూ.26,000గా నిర్ణయించి అమలు చేయాలని, జీవో నెం.51ను సవరించాలని, కారోబార్‌లు, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలని, ఉద్యోగ భద్రతతో పాటు పర్మినెంట్ చేయాలని, బీమా సౌకర్యం, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం జూన్ 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు జస్వంత్‌తో పాటు నల్లవెల్లి రామకృష్ణ, మహేష్, సుభాష్, రాము, లక్ష్మయ్య, బాలయ్య, వెంకటయ్య, కుర్మయ్య, ఎల్లయ్య, మంగమ్మ, శశికళ, లక్ష్మమ్మ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *