పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 6 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గంలో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల ద్వారా జరుగుతున్న అదనపు వసూళ్లపై మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పలాస-కాశీబుగ్గలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఇవి సాధారణ అక్రమ వసూళ్లు కాదని, “అక్క వసూళ్లు” అని ఎద్దేవా చేశారు.పలాస నియోజకవర్గంలోని 24 మద్యం దుకాణాల్లో ప్రతిరోజూ సుమారు 550 కేసుల మద్యం, 350 కేసుల బీర్ విక్రయాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద రోజుకు 30 వేలకుపైగా బాటిళ్లు అమ్ముడవుతున్నాయని, ప్రతి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయని తెలిపారు. కనీసం రూ.10 చొప్పున లెక్కించినా రోజుకు సుమారు రూ.3 లక్షల మేర ప్రజల నుంచి అదనంగా వసూలవుతోందని, నెలకు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ప్రజల కష్టార్జిత ధనం దోచుకుంటున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. ప్రజల చెమటోడ్చి సంపాదించిన డబ్బును ఈ విధంగా దోచుకోవడం దారుణమన్నారు. పలాస నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేను విజిటింగ్ ఎమ్మెల్యే గా అభివర్ణిస్తున్నారని, నెలలో ఎక్కువ రోజులు విశాఖపట్నంలోనే ఉంటూ, నెలకోసారి పలాసకు వచ్చి ఈ వసూళ్ల డబ్బు సేకరించుకుని తిరిగి వెళ్లిపోతున్నారనే విమర్శలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అదనపు వసూళ్ల అంశంపై గతంలో కూడా తాను శ్రీనివాస లాడ్జి వద్ద ధర్నా నిర్వహించి, ఆర్డీఓ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించానని గుర్తు చేశారు. ప్రజల తరఫున ఈ వసూళ్ల గురించి ప్రశ్నించినందుకే తనపై మర్డర్ కేసు నమోదు చేశారని ఆరోపించారు. అనేక ప్రజా సమస్యలపై ఆందోళనలు చేసినప్పటికీ, ఈ మద్యం వసూళ్ల అంశాన్ని లేవనెత్తినప్పుడు మాత్రమే తీవ్రమైన కేసులు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.నిజంగా ఈ వసూళ్లు జరగడం లేదంటే స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల జేబులను ఖాళీ చేస్తూ సాగుతున్న ఈ వ్యవస్థపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి డ స్పష్టం చేశారు.