పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాసలో “వెన్నుపోటుకు రెండేళ్లు” భారీ నిరసన ర్యాలీ ప్రజా వ్యతిరేక కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు , పలాస నియోజకవర్గంలో ఏర్పాటు చేయుటకు జూన్ 12 న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు..రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “వెన్నుపోటుకు రెండేళ్లు” రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా జూన్ 12వ తేదీ శుక్రవారం పలాస నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు.ఉదయం 10 గంటలకు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి ప్రారంభమయ్యే ఈ భారీ ర్యాలీ కాశీబుగ్గ వైఎస్సార్ స్క్వేర్ వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, మహిళలకు ప్రకటించిన పథకాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మద్దతు, విద్యార్థులకు సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఎన్నికల హామీలకే పరిమితమయ్యాయని డాక్టర్ సీదిరి అప్పలరాజు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపాయని, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, మెగా డీఎస్సీ నియామకాల విషయంలో కూడా నిరుద్యోగులను నిరాశపరిచిందని ఆయన ఆరోపించారు.ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ఈ రెండేళ్ల పాలన ప్రజలకు అభివృద్ధి కాకుండా వెన్నుపోటుగా మారిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఎన్నికల హామీల అమలు కోసం నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీని పలాస నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కోరారు.