పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 3 ,జగ్గయ్యపేట పట్టణం, స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ జగ్గయ్యపేట ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్లబ్ కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సమాజానికి వైద్యులు అందిస్తున్న అసమాన సేవలను కొనియాడుతూ, జగయ్యపేట్ట పట్టణంలోని ప్రముఖ వైద్యులను ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో దేవుడి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన స్థానం వైద్యులదేనని కొనియాడారు. కరోనా వంటి విపత్కర కాలం నుండి నేటి వరకు ప్రజల ప్రాణాలను కాపాడటంలో వైద్యులు చేస్తున్న కృషి అమోఘమైనదని కొనియాడారు. ఘన సన్మానం: నిరుపేదలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, జగ్గయ్యపేట పరిసర ప్రాంత ప్రజల మన్ననలు పొందుతున్న డా ఆళ్ల హరీష్ ని లయన్స్ క్లబ్ ప్రతినిధులు శాలువా కప్పి, జ్ఞాపికతో అత్యంత ఘనంగా సత్కరించారు. నిరంతరం సేవా భావంతో బాధ్యతలు నిర్వర్తిస్తూ, వైద్య వృత్తికే వన్నె తెస్తున్నారని ఈ సందర్భంగా మీ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు, ఈ సత్కారాన్ని అందుకున్న అనంతరం డాక్టర్ ఆళ్ల హరీష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లాంటి అంతర్జాతీయ సేవా సంస్థ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు, ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా జగ్గయ్యపేట ప్రజలకు మరింత నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్యాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు, తనకు ఈ గౌరవాన్ని అందించిన లయన్స్ క్లబ్ నిర్వాహకులకు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారితో పాటు క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు మరియు వైద్య సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
.
