శాసనసభ కీలక కమిటీల్లో కవ్వంపల్లికి చోటు

పయనించే సూర్యుడు న్యూస్ :జులై :09: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :తెలంగాణ శాసనసభకు సంబంధించిన పలు కీలక కమిటీల్లో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు స్థానం లభించింది. శాసనసభ స్పీకర్ ఆదేశాల మేరకు వివిధ కమిటీలను తాజాగా పునర్‌వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా డాక్టర్ కవ్వంపల్లిని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యునిగా నియమించారు. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యునిగా… ప్రభుత్వం రూపొందించే నిబంధనలు, ఉప చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించే కీలకమైన సబార్టినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యునిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకమయ్యారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ సభ్యునిగా… ఎస్సీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగం, సమస్యలపై అధ్యయనం చేసి శాసనసభకు నివేదిక ఇచ్చే బాధ్యత కలిగిన షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ సభ్యునిగా డాక్టర్ కవ్వంపల్లికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)ఎస్సీ సెల్ చైర్మన్ గా డాక్టర్ సత్యనారాయణ పని చేస్తున్న అనుభవం శాసనసభ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేష నేరాల నిరోధక బిల్లు–2026 సెలెక్ట్ కమిటీ సభ్యునిగా.. రాష్ట్రంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను, సామాజిక, సామరస్యానికి భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు తీసుకొస్తున్న బిల్లులపై లోతైన అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడానికి ఏర్పాటైన సెలెక్ట్ కమిటీలో కూడా డాక్టర్ కవ్వంపల్లికి చోటు లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తనపై నమ్మకంతో కమిటీల్లో స్థానం కల్పించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము కాకుండా ఈ మూడు కమిటీల బాధ్యతలను నిజాయితీగా, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ సంక్షేమ కమిటీ ద్వారా మానకొండూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను” అని అన్నారు.కవ్వంపల్లికి ఆయా కమిటీల్లో చోటు దక్కడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *