ఆపన్నులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి: పదకొండు మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి మరియు మహ్మద్ తన్వీర్

పయనించే సూర్యుడు, జూలై 7 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అద్భుతమైన ఆర్థిక భరోసాగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి సోమవారం అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో ఉన్న తన నివాసంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పదకొండు మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ తో కలిసి ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసి అనేక వ్యాధులకు ఉచిత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రజలకు అత్యంత అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం ఈ పథకం యొక్క ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ సహాయ నిధి చెక్కుల మంజూరుకు ప్రత్యేక కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరియు సెట్విన్ సంస్థ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డిలతో పాటు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డికి లబ్ధిదారులు ఈ సందర్భంగా తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యునూస్, సహకార సంఘం చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ వైస్ మండలాధ్యక్షుడు రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, జాఫర్, జావిద్, జహంగీర్, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, రాంచందర్, అశ్విన్ పాటిల్, సునీల్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *