ఇసుక టిప్పర్ ఢీకొని యువకుడు మృతి.. డ్రైవర్ అరెస్ట్

పయనించే సూర్యుడు జూన్ 08, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ వాహనం ప్రమాదానికి కారణమై ఒక యువకుడు మృతి చెందిన ఘటనలో టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 5వ తేదీ తెల్లవారుజామున చింతకాని గ్రామానికి చెందిన మాతంగి నాగరాజు, అతని స్నేహితుడు లింగాల మహేందర్ కలిసి ఖమ్మంలోని ఆసుపత్రిలో ఉన్న తమ స్నేహితుడిని పరామర్శించి బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో పందిళ్లపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో బోనకల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్‌ను డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న వారి బైక్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో మాతంగి నాగరాజు తీవ్ర గాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, లింగాల మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, టిప్పర్ డ్రైవర్ తోట వెంకటేశ్వర్లు (32), తండ్రి మల్లయ్య, నివాసం కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా అని గుర్తించారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోగా, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *