ఝరాసంగం మరియు కోహీర్ పట్టణాలలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని జహీరాబాద్ శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఝరాసంగం మండల కేంద్రంతో పాటు కోహీర్ పట్టణంలో జరుగుతున్న ఈ ప్రక్రియను ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, కోహీర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు సంగమేశ్వర్, సీనియర్ నాయకుడు కలీమ్ మరియు యువ నాయకుడు కొనింటి మిథున్ రాజ్ లతో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల నమోదు, కొత్త ఓట్ల మార్పులు, చేర్పులు మరియు నకిలీ ఓట్ల తొలగింపుల ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు మరియు బూత్ లెవల్ ఏజెంట్లు ఎలా నిర్వహిస్తున్నారో స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు అత్యంత పారదర్శకంగా మరియు నిబంధనలకు అనుగుణంగా ఈ సవరణ ప్రక్రియను నిర్వహించాలని కోరారు. అలాగే బూత్ లెవల్ ఏజెంట్లు ప్రతి ఇంటిని సందర్శించి స్థానిక ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, ఓటరు జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే గుర్తించి వాటిని క్షేత్రస్థాయిలోనే సరిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు సైతం ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు బూత్ లెవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *