పాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

నాణ్యతతో ఇండ్లు పూర్తి చేసి త్వరగా గృహప్రవేశాలు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

పయనించే సూర్యుడు మే 30 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శుక్రవారం ఉదయం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు బోనాసి జ్యోతి శిరీష, గౌరమ్మలకు మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న కలెక్టర్, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని నాణ్యత ప్రమాణాలతో ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్హ కుటుంబం గౌరవప్రదమైన జీవనం గడపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరగా గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల పరిస్థితిని కూడా కలెక్టర్ పరిశీలించారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండల స్థాయి అధికారులు, ఎంపీడీవో కథలప్ప, డిప్యూటీ ఎమ్మార్వో రవికుమార్, డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, గ్రామపంచాయతీ అధికారులు, హౌసింగ్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *