పయనించే సూర్యుడు జూన్ 07(హైదరాబాద్ మాధవరెడ్డి ) ప్రైవేట్ పాఠశాలల్లో అమలవుతున్న ప్రవేశాలు మరియు ఫీజుల విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ కోరింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ని కలిసి సీసీవీ ప్రతినిధుల బృందం ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు నిబంధనలు ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతులు, నాణ్యమైన విద్య మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు సీసీవీ ప్రతినిధులు తెలిపారు. ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ పరీక్షలు లేదా ప్రవేశ పరీక్షలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలి కాపిటేషన్ ఫీజులు విరాళాలు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఫీజులకు అదనంగా ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలి. అన్ని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలు తమ పూర్తి ఫీజు నిర్మాణాన్ని పాఠశాల నోటీస్ బోర్డులు మరియు అధికారిక వెబ్సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించేలా ఆదేశాలు జారీ చేయాలి. అక్రమ ఫీజుల వసూళ్లు, ప్రవేశాల ఉల్లంఘనలు మరియు కాపిటేషన్ ఫీజులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.సీసీవీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి విద్యా సంవత్సరంలో అనేక మంది తల్లిదండ్రులు ఫీజుల వివరాలు వెల్లడించకపోవడం, వివిధ పేర్లతో అదనపు రుసుములు వసూలు చేయడం, ప్రవేశాల విషయంలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.1, జి.ఓ.ఎం.ఎస్. నెం.42 మరియు విద్యా హక్కు చట్టం-2009 నిబంధనలు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ ప్రజా ప్రయోజనాల పక్షాన తన పోరాటాన్ని కొనసాగిస్తుంది ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ వ్యవస్థాపక సభ్యులు కె. నరేష్ బాబు, కె. రామ్మోహన్, వెంకటేష్, సాయికిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.