బచ్చన్నపేటలో గంజాయి కలకలం

14 కిలోల గంజాయి స్వాధీనం.మహారాష్ట్ర నిందితుడు అరెస్ట్

పయనించే సూర్యుడు, జూన్ 1 బచ్చన్నపేట మండల ప్రతినిధి నీల పవన్. జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు, వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్, మార్గ దర్శకత్వంలో బచ్చన్నపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుండి గుజరాత్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రూ. 8 లక్షల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.​పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన రాహుల్ అకలేకర్ (తండ్రి: రాజేందర్) సులభంగా డబ్బు సంపాదించి, జల్సాలు చేయాలనే ఉద్దేశంతో ఈ అక్రమ రవాణాకు తెరలేపాడు. తన సహ నిందితులైన అమర్, వినయ్, అక్రమ్ ల ఆదేశాల మేరకు ఒడిశాలోని బరంపూర్ నుండి గుజరాత్‌లోని వల్సాడ్ ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నాడు. ​ఈ క్రమంలో బచ్చన్నపేట బస్ స్టాండ్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిందితుడు రాహుల్ అకలేకర్ గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడిపై బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎన్పీడీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితులు (అమర్, వినయ్, అక్రమ్) కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ​​ఈ సందర్భంగా నర్మెట్ట సర్కిల్ సి.ఐ. ఎం. అబ్బయ్య, బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై పోలీసు శాఖ రాజీలేని వైఖరితో కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అక్రమ వ్యసనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *