పయనించే సూర్యుడు, జూన్ 09 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహడ్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎంపిడిఓ కె.జమలా రెడ్డి ఆధ్వర్యంలో, సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా ఎంపిడిఓ జమలారెడ్డి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా గ్రామంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 4రకాల చెత్త సేకరణలు గురించి వివరించారు. గ్రామంలోని అన్ని రోడ్లు, డ్రైన్లు, కాలువలను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించాలి. మురుగు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే పూడిక తీయించాలి. వీధి దీపాలు పనిచేసేలా చూడాలి అని అధికారులను ఆదేశించారు.త్రాగునీటి విషయంలో అన్ని బోర్లు, మోటార్లు, పైప్‌లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మరమ్మతులు చేయించాలని, క్లోరినేషన్ ప్రక్రియను ప్రతిరోజూ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు.పారిశుధ్యంపై మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణను ప్రతిరోజూ తప్పనిసరిగా చేయాలి. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని ప్రతి ఇంట్లో అమలు చేయాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు ప్రజలకు 4 రకాల చెత్త సేకరణల గురించి అవగాహన కల్పించాలని అన్నారు.అనంతరం పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా మాట్లాడుతూ యువత యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. నేటి మొక్కలే రేపటి ప్రాణ వాయువు. హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి అని పిలుపునిచ్చారు.సర్పంచ్ మందా నాగరాజు మాట్లాడుతూ గ్రామ సభలో వచ్చిన ప్రజా సమస్యలను నమోదు చేసుకుని, దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉపసర్పంచ్ గుండె వెంకన్న మాట్లాడుతు గ్రామస్తులు వీధి లైట్లు, డ్రైనేజీ, మంచి నీటి సరఫరా వంటి సమస్యలు పంచాయతీ దృష్టికి తీసుకు రావాలని తద్వారా సమస్యలు తోరగ పరిష్కారం అవుతాయి అని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి సంపత్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బర్ల నాగమణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు (అడ్వకేట్) భజన సతీష్ కుమార్,ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ రవిలా దేవి,మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ నితిన్,హౌసింగ్ ఏఈ,విద్యుత్ శాఖ అధికారి ఆదినారాయణ,బూర్గంపహాడ్ జిపిఓ దీపిక, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.