పయనించే సూర్యుడు జులై 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి: జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బిజినపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలనే లక్ష్యంతో కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఎద్దుల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా బింగి నరేష్, మండల కార్యదర్శిగా కటికే కృష్ణాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీదేవి, గుడ్ల నర్వ శ్రీశైలం, కోశాధికారిగా పూర్ణ శంకర్ రామ్మోహన్ బాధ్యతలు చేపట్టారు. అలాగే కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతన కమిటీ సభ్యులను జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సమితి నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నూతన కమిటీ సభ్యులు మండలంలోని ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సమితి నాయకులు, మండలంలోని దివ్యాంగుల సంఘ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. కొత్త కమిటీ దివ్యాంగుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.