పయనించే సూర్యుడు జులై 4 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన రైతు సేవ కేంద్రంలో ముమ్మిడివరం బ్లాక్ ఆత్మ సౌజన్యంతో మండల వ్యవసాయాధికారి బి మృదుల ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పంట సాగు, నానో సాంకేతికత ఆధారిత పోషకాల వినియోగం అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నందకిషోర్ హాజరయ్యారు. జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత, చిరుసంచులు ప్రదర్శన అంశాలపై రైతులకు వివరించారు. ఖరీఫ్ కు అనుకూలమైన వరి రకాలు ఎమ్ సి ఎం 140, ఆర్ జి ఎల్ 7038 విత్తనాలు రెండు కిలోల చొప్పున రైతులకు అందజేశారు. వాటి ప్రాముఖ్యతను వివరించారు. మండల వ్యవసాయాధికారి బి మృదుల మాట్లాడుతూ రైతులు అందరూ వరి నారుమడులు త్వరితగతిన వేసుకుని నాట్లు తొందరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నారుమడులు వేసుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలని, విత్తన మొలక శాతం చూసుకున్న తరువాతనే నారుమడి వేసుకోవాలని తెలిపారు. పంట వేసిన తరువాత పంట నమోదు చేసుకుంటే దాని ద్వారా పంటకు కావాల్సిన ఎరువులను ఎపిఐఎంఎస్ అనువర్తనం ద్వారా రైతులు ఎక్కడైనా తీసుకునే వీలుందన్నారు. కావున పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాట్రేనికోన గ్రామ వ్యవసాయ సహాయకులు మనోజ్, సుధ, దేవేంద్ర పాల్గొన్నారు.