విచ్చలవిడిగా విద్యుత్ కోతలు.. సింగరేణి మండల ప్రజల సహనానికి పరీక్ష

కరెంట్ లేక చిన్నారుల చదువులకు ఆటంకం.. అప్రకటిత కోతలపై ప్రజల ఆగ్రహం

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 8, సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలంలో కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ అంతరాయాలతో గ్రామాల్లో ప్రజల సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు అత్యధికంగా నష్టపోతున్నారు. రాత్రి వేళల్లో కరెంట్ లేకపోవడంతో చిన్నారులు చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షలు, హోంవర్క్‌లు పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కపోత వాతావరణంలో చిన్నపిల్లలు, వృద్ధులు నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతల ప్రభావం తాగునీటి సరఫరాపై కూడా పడుతోంది. మోటార్లు పనిచేయక గ్రామాల్లో నీటి సమస్య తలెత్తుతోంది. చిన్న వ్యాపారులు, దుకాణదారులు, రైతులు సైతం విద్యుత్ అంతరాయాలతో నష్టపోతున్నారు. తరచూ కరెంట్ పోవడంతో విద్యుత్ పరికరాలు దెబ్బతింటాయనే భయం కూడా ప్రజల్లో నెలకొంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల అవసరాలను గుర్తించి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *