గూడూరులో ఘనంగా వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు.

* ఐదేళ్ల పాలనతో మూడు తరాల జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైయస్సార్. * కాంగ్రెస్ నాయకులు పర్వతాల శీను గౌడ్, షేక్ నాయకుల ఫయాజ్.

పయనించి సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 9: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, ప్రజా హృదయ విజేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శీను గౌడ్, తిరుపతి జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ నాయకుల ఫయాజ్ లు ప్రసంగిస్తూ, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ ఒక తిరుగులేని నాయకుడిగా వెలుగొందారని కొనియాడారు. 1978 ఎన్నికల్లో తొలిసారి ఘనవిజయం సాధించిన నాటి నుండి ప్రజాపక్షాన నిలిచిన ఆయన, 2003 మండువేసవిలో సుమారు 1,467 కిలోమీటర్ల మేర చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రతో ప్రజల కష్టాలను కళ్లారా చూశారని గుర్తుచేశారు. ఆ ప్రజా సంకల్పంతోనే 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేసి రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికారని శ్లాఘించారు. కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం మాత్రమే పరిపాలన చేసినప్పటికీ, పేదవాడి కడుపు నిండాలని, పదికాలాల పాటు వారు ఆరోగ్యంగా జీవించాలని తపించిన ఆయన మూడక్షరాల పేరు మూడు తరాల తర్వాత కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. కొందరికే పరిమితమైన కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారని, పట్టుమని పదో తరగతి దాటని కుటుంబాల పిల్లలకు ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’తో ఉన్నత చదువుల డిగ్రీ పట్టాలందించారని, అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి దైవంగా మారిన ‘108 అంబులెన్స్’ సేవలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలతో పరిపాలనలో చెరగని ముద్ర వేశారని నేతలు కొనియాడారు. వ్యవసాయం దండుగ అన్న వారిని ఢీకొట్టి ‘జలయజ్ఞం’తో సాగునీరు అందించి వ్యవసాయాన్ని పండుగ చేయడంతో పాటు, రూ.2 కే కిలో బియ్యంతో పేదవాడి కడుపు నింపిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ అని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయాన్ని చేకూర్చారని పేర్కొన్నారు. ఇటువంటి అద్భుత ప్రజా సంక్షేమ పథకాలే ఆయనను ఒక సాధారణ మనిషి నుంచి మహానేతగా మార్చాయని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం ఇంచార్జ్ ఇంగిలాల భాస్కర్, గూడూరు పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ బాషా, గూడూరు పట్టణ లీగల్ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని దివంగత ముఖ్యమంత్రికి అంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *