టిఫిన్ సెంటర్లలో రేట్ల మోత – సామాన్యుడి జేబుకు చిల్లు

పయనించే సూర్యుడు మే 21 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: ఏన్కూరు మండలం లో పలు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల వరకు రూ.30 ఉన్న ఇడ్లీ ప్లేట్ ఒక్కసారిగా రూ.45కి, రూ.35 ఉన్న దోసె రూ.55కి చేరింది. రేట్లు చూస్తే భయమేస్తోంది. ఒకప్పుడు రూ.50తో ఇద్దరు టిఫిన్ చేసేవాళ్లం, ఇప్పుడు ఒక్కరికే సరిపోవడం లేదు” అని ఏన్కూరు మండల సామాన్య ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. హోటల్ యజమానులు మాత్రం గ్యాస్, నూనె, కూరగాయల ధరలు పెరిగాయని, కరెంట్ బిల్లు, అద్దెలు భారంగా మారాయని కారణాలు చెబుతున్నారు. కానీ రేట్ల పెంపునకు, వస్తువుల ధరల పెరుగుదలకు పొంతన లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. “పప్పులు, నూనె 10% పెరిగితే వీళ్లు టిఫిన్ రేటు 50% పెంచుతున్నారు. అడిగితే ‘నచ్చితే తిను, లేకపోతే వెళ్ళు’ అని దురుసుగా మాట్లాడుతున్నారు” ఒకప్పుడు పేదవాడి ఆకలి తీర్చే టిఫిన్ సెంటర్లు ఇప్పుడు లాభాల కోసం రేట్లు పెంచుతూ సామాన్యుడికి అందనంత దూరం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు జోక్యం చేసుకుని రేట్ల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం రేట్ బోర్డులు ఏర్పాటు చేసి అమలు చేయాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *