పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే.22.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మండల పరిధిలోని లద్దిగం గ్రామ పంచాయతీలో సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమాలను, చెత్త సేకరణ ప్రక్రియను డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ గురువారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ప్రతి ఇల్లూ స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ, పారిశుధ్య కార్మికులు ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నారా లేదా అని డిప్యూటీ ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు. చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను గ్రామస్తులకు వివరించారు. తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా వాహనాలకు అందించాలని కోరారు. గ్రామంలో ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా ప్రతిరోజూ పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో లద్దిగం గ్రామ పంచాయతీ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.