పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 24 జగ్గయ్యపేట శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ మరోసారి ప్రజల మన్ననలు పొందారు. వత్సవాయి మండలం పరిధిలోని భీమవరం – చిల్లకల్లు జాతీయ రహదారి టోల్‌గేట్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడంతో రహదారి ఇరువైపులా ఎండిపోయి ఉన్న చెట్లు, పొదలు, కొమ్మలు ఒక్కసారిగా మంటలకు ఆహుతయ్యాయి. దాదాపు కిలోమీటర్ మేర మంటలు వ్యాపించి భారీగా పొగలు కమ్ముకోవడంతో టోల్‌గేట్ పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగ కారణంగా వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం మరింత తీవ్రమవుతుందనే ఆందోళనతో టోల్‌గేట్ సిబ్బంది వెంటనే ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అత్యవసరంగా స్పందించి ఇటీవల ఎమ్మెల్యే సూచనలు మేరకు తయారు చేయబడిన మినీ ఫైర్ ఇంజన్లను సంఘటన స్థలానికి తరలించడంతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా రాంకో సిమెంట్స్ సంస్థకు చెందిన నీటి ట్యాంకర్లను కూడా రంగంలోకి దింపించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ, టోల్‌గేట్ సిబ్బంది సమన్వయంతో మంటలను అదుపులోకి తెచ్చే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) స్వయంగా మినీ ఫైర్ ఇంజన్ వద్ద నిలబడి అగ్నిమాపక సిబ్బందికి సూచనలు చేస్తూ అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించి మినీ ఫైర్ ఇంజన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రమాదం మరింత విస్తరించకుండా నిలువరించగలిగామని స్థానికులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సమయంలో రహదారిపై చిక్కుకున్న వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. అనంతరం మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో వాహన రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మినీ ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న మంటలు పెద్ద ప్రమాదాలుగా మారకముందే వాటిని అదుపు చేయడానికి మినీ ఫైర్ ఇంజన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో వేగవంతమైన స్పందనే ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది, రాంకో సిమెంట్స్ సంస్థ ప్రతినిధులు, టోల్‌గేట్ సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు సమిష్టిగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తక్షణ స్పందనను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.