రామకృష్ణాపురం రైల్వే గేట్ 107కు ఎప్పుడు పరిష్కారం?

* అండర్‌పాస్ లేదు… ఫ్లైఓవర్ లేదు… ప్రజల ఇబ్బందులు తారస్థాయికి

పయనించే సూర్యుడు మే 25, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని రామకృష్ణాపురం పరిధిలోని రైల్వే గేట్ నం.107 స్థానిక ప్రజలకు నిత్య సమస్యగా మారింది. పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఈ గేట్ తరచూ ఎక్కువసేపు మూసివేయబడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు గేట్ వద్దే నిలిచిపోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాము కాట్లు, తేలు కాట్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్యం అందక ప్రాణాపాయం ఏర్పడుతోందని వారు చెబుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణాపురం, బసవపురం, పందిళ్లపల్లి, అనంతసాగర్, గాంధీనగర్, బొప్పారం తదితర దాదాపు పది గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ఈ గేట్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు, పాలు అమ్మేవారు, విద్యార్థులు, స్కూల్ బస్సులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఇలా ప్రతి వర్గానికీ ఈ గేట్ సమస్యగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ రైళ్ల రాకపోకల కారణంగా గేట్ అరగంటకుపైగా మూసివేయబడుతుండటంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. “గేట్ తెరిచారంటే చాలు… హమ్మయ్య బతికాం అనిపిస్తోంది” అంటూ స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఖమ్మం నుంచి ఎర్రుపాలెం వరకు అనేక రైల్వే గేట్ల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ, ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న రామకృష్ణాపురం గేట్ 107 మాత్రం ఇంకా నిర్లక్ష్యానికే గురవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.కాబట్టి ఈ గేట్ వద్ద వెంటనే ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *