వార్డుల విభజన సరిచేయాలి ఆర్డీఓకు వైఎస్సార్సీపీ నాయకుల వినతి

పయనించే సూర్యుడు మే 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇటీవల ఐదు కొత్త వార్డులను పెంచే క్రమంలో చేపట్టిన వార్డుల విభజన అస్తవ్యస్తంగా జరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఆర్డీఓ దీనిపై సమగ్రంగా పరిశీలించి తక్షణమే సరిచేయాలని కోరుతూ సోమవారం వినతి పత్రం అందజేశారు.ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ బి. పావనికి పార్టీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చేసిన వార్డుల విభజన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేలా ఉందన్నారు. ఒకే ప్రాంతంలో నివసించే ప్రజలను వేర్వేరు వార్డుల్లో చేర్చడమే కాకుండా, కొందరి ఓట్లను దూర ప్రాంత వార్డులకు మార్చడం వల్ల ప్రజలు తమ ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన వార్డుల విభజన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కాలనీలు, వీధులు, కుటుంబాలను విభజించి వేర్వేరు వార్డుల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపాటుగా విభజన చేపట్టారని విమర్శించారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి వార్డుల విభజనను పునఃసమీక్షించాలని కోరారు. స్థానిక పరిస్థితులు, జనాభా, భౌగోళిక అనుసంధానం ఆధారంగా వార్డులను సక్రమంగా పునర్విభజించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, యువత నాయకుడు నోటి వినయ్ కుమార్ రెడ్డి, టౌన్ బూత్ కమిటీ కన్వీనర్ బత్తిన నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *