రాజాపూర్‌లో క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫామ్‌ల పంపిణీ

* విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: మహబూబ్ నగర్ ఫుట్‌బాల్ అసోసియేషన్ * మరో శీర్షిక: చదువుతో పాటు క్రీడలు భవిష్యత్తుకు పునాది: బంగారి వెంకటేష్

పయనించే సూర్యుడు మే 30 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహబూబ్ నగర్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు బుధవారం స్పోర్ట్స్ యూనిఫామ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇబ్రహీం, మండల ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారి వెంకటేష్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను, శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ముఖ్యంగా ఫుట్‌బాల్ క్రీడ మెదడుకు, శరీరానికి మంచి చురుకుదనాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటు పడి సమయాన్ని వృథా చేస్తున్నారని, అటువంటి సమయాన్ని క్రీడలకు కేటాయిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. విద్యార్థులు ఆటను ఇష్టపడి ఆడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు ప్రతిభ కనబరిస్తే మండల నాయకులందరూ కలిసి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసులు, శ్రీహరి, మొయిన్, మోజెస్, పీడీ రాములు, కోచ్ ప్రకాష్, బీఎస్పీ మండల అధ్యక్షులు కాకరకాయల యాదగిరి, నాయకులు శ్రీశైలం, అనిల్ కుమార్ ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *