స్మశాన వాటిక రహదారి సర్వే చేయాలంటూ తహసిల్దార్ కి వినతి.

వినతి పత్రం సమర్పించిన అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్

పయనించే సూర్యుడు, మే31, అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో సుమారు ఏడేళ్ల క్రితం నిర్మించిన స్మశాన వాటికకు ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్, ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ శనివారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శవయాత్రలను బాబు జగ్జీవన్ రామ్ కాలనీతో పాటు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తీసుకెళ్లాల్సి వస్తోందని, దీంతో పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో స్థానికులకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు.ఈ సమస్యపై గతంలో పలుమార్లు కలెక్టర్, తహసీల్దార్లు మరియు ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దల సమాచారం మేరకు మల్లమ్మ సెంటర్ నుంచి చింతల చెరువు కట్ట వరకు గతంలో డొంక దారి ఉండేదని, ప్రస్తుతం అది కనుమరుగైందని తెలిపారు. కావున పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించి రెవెన్యూ సర్వేయర్‌తో సర్వే నిర్వహించి, ఆ డొంక దారిని గ్రామపంచాయతీకి అప్పగించాలని కోరారు. దారిని అప్పగించిన వెంటనే గ్రామపంచాయతీ నిధులతో రహదారి నిర్మాణం చేపడతామని తెలిపారు. వర్షాకాలానికి ముందే ఈ ప్రక్రియ పూర్తయితే రహదారి నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంటూ, గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *