పయనించే సూర్యుడు జూన్ 02, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్వరరావు కుటుంబానికి ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అల్లాడి సృజన్ ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 2024లో సంభవించిన వరదల సమయంలో నాగేశ్వరరావు తన భార్యతో కలిసి బండిపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య తీవ్ర గాయాలతో మృతి చెందగా, నాగేశ్వరరావు చేయి విరిగి తీవ్రంగా గాయపడింది. అనంతరం శస్త్రచికిత్సలు నిర్వహించినప్పటికీ ఆయన చేయి పూర్తిస్థాయిలో కోలుకోలేదు. భార్యను కోల్పోయిన నాగేశ్వరరావు ఇద్దరు చిన్నారుల బాధ్యతలు మోస్తూ, ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారు. ఈ కుటుంబం ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిపై ఆర్గాన్ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని రేపల్లెవాడ గ్రామానికి చెందిన పోతగాని పుల్లారావు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అల్లాడి సృజన్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న డాక్టర్ సృజన్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తన వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో డాక్టర్ అల్లాడి సృజన్ స్వయంగా రామకృష్ణాపురం గ్రామానికి చేరుకుని నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. మూడు నెలలకు సరిపడా బియ్యం, కందిపప్పు, పల్లీలు, సబ్బులు తదితర నిత్యావసర సరుకులను అందజేసి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన్ మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా తనకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అలాగే నాగేశ్వరరావు చిన్న కుమారుడి విద్యాభ్యాసానికి అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గండారపు రామారావు (ఆర్ఎంపీ), రేపల్లెవాడ గ్రామానికి చెందిన సామినేని ఫణీందర్, ప్రశాంత్, కళ్యాణ్‌తో పాటు రామకృష్ణాపురం గ్రామ యువకులు శీలం తనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గాన్ పత్రిక కథనానికి స్పందించి నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన డాక్టర్ అల్లాడి సృజన్ సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.