పయనించే సూర్యుడు జూన్ 2 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ రాష్ట్ర ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తయినా సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి ఇంకా సవాల్‌గానే ఉందని విశ్లేషకుడు కూన గోవర్ధన్ అభిప్రాయం తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా 1200 మంది అమరుల ఆత్మబలిదానాలు, అనేక ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అయితే అమరుల ఆశయాలు పూర్తిస్థాయిలో నెరవేరాయా అనే ప్రశ్న నేటికీ సమాజంలో చర్చనీయాంశంగా ఉందని విశ్లేషకుడు, హెల్త్ అసిస్టెంట్ కూన గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల సాధన లక్ష్యంగా సాగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రజలు వివక్ష, నిర్లక్ష్యం, అవకాశాల లోపాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా సాగిన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో, సడక్ బంద్ వంటి ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. 2011లో జరిగిన 42 రోజుల సకల జనుల సమ్మె దేశవ్యాప్తంగా ప్రభావం చూపిందని, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమ్మెతో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చివరకు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందన్నారు.
2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ ప్రకటన చేయగా, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో కేంద్రం వెనక్కి తగ్గిందని, కానీ ఉద్యమం మరింత ఉధృతమై చివరకు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిందని వివరించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన రాష్ట్ర ఆవిర్భావాన్ని చూడకుండానే కన్నుమూశారని పేర్కొన్నారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సూచించిన చిన్న రాష్ట్రాల ఆలోచన తెలంగాణ ఆవిర్భావానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం గడిచినా ఇంకా విద్యుత్, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్న గ్రామాలు, తండాలు, చెంచు పెంటలు రాష్ట్రంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి, నిరుద్యోగం, అవినీతి, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలు పూర్తిగా తొలగినప్పుడే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు సార్థకమవుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు తగిన న్యాయం జరగాలని, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం, అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ప్రజల ఆత్మగౌరవం, సమాన అభివృద్ధి, సామాజిక న్యాయం సాధించినప్పుడే పోరాడి సాధించుకున్న తెలంగాణ కల నిజమైన అర్థంలో సాకారమైనట్టవుతుందని కూన గోవర్ధన్ పేర్కొన్నారు.