పయనించే సూర్యుడు, జూన్ 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ విమల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల సందర్భంగా ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ కాశీనాథ్‌తో కలిసి సర్పంచ్ విమల శ్రీనివాస్‌రెడ్డి వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కాశీనాథ్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించుకోవచ్చని అవగాహన కల్పించారు. అనంతరం ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ విద్యార్థులను సర్పంచ్ విమల శ్రీనివాస్ రెడ్డి శాలువాలు కప్పి అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు చదివి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విమల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల జీవితాల్లో వెలుగును నింపేందుకే ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.