పయనించే సూర్యుడు / జూన్ 3 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని నర్సింహులపల్లి గ్రామంలో కులవివక్ష ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామానికి చెందిన వంతడుపుల పోచమ్మ ఇటీవల మృతిచెందగా, ఆమె అంత్యక్రియల కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను వినియోగించేందుకు కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్‌ను ఆశ్రయించారు. సర్పంచ్ అనుమతి ఇచ్చినప్పటికీ, ట్రాక్టర్ డ్రైవర్ కందం కిషన్‌రావు వాహనాన్ని నడపడానికి నిరాకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, “మీరు తక్కువ కులానికి చెందినవారు. మీ కోసం ట్రాక్టర్ నడిపితే ముట్టుడు అవుతుంది. నేను ట్రాక్టర్ నడపను” అంటూ డ్రైవర్ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. అంతేకాకుండా దుర్భాషలాడుతూ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేశాడని ఆరోపించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శితో మాట్లాడి, కులం పేరుతో అవమానించిన డ్రైవర్ కందం కిషన్‌రావుపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంతడుపుల బాబు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా అందరికీ సమాన హక్కులు ఉన్నప్పటికీ ఇప్పటికీ కుల వివక్ష ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే గ్రామపంచాయతీ వాహనాన్ని కులం పేరుతో నిరాకరించడం అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. తక్షణమే హుజురాబాద్ ఏసీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నేటి సమాజంలో కూడా కులం పేరుతో వివక్ష కొనసాగడం విచారకరమని, ఇలాంటి ఘటనలు సామాజిక సమానత్వానికి భంగం కలిగిస్తాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి మాడ్గుల ఓదెలు, వంతడుపుల అరుణ్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.