సిరిజాం గ్రామంలోఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం

పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్. తే 8.6.2026 అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం సిరిజాం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), కొండెంపూడి ఆధ్వర్యంలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీకే కొండెంపూడి సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డా. ఎన్. రాజకుమార్, డా. ఎన్. కిశోర్ కుమార్, డా. ఎన్. సతీబాబు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (రార్స్), అనకాపల్లి నుండి డా. చి. సీతారామలక్ష్మి, డా. డి. ఉమా మహేశ్వరరావు వనరుల వ్యక్తులుగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారి కృష్ణవేణి, రైతు సాధికార సంస్థ సభ్యులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఖేత్ బచావో అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలైన నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య పోషక నిర్వహణ, సేంద్రియ పదార్థాల వినియోగం మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. డా. ఎన్. రాజకుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ భూములలో నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించవచ్చని తెలిపారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. డా. ఎన్. కిశోర్ కుమార్ మాట్లాడుతూ, పంట అవసరాలకు అనుగుణంగా నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాల సమతుల్య వినియోగం అత్యంత అవసరమని తెలిపారు. రైతులు నేల పరీక్షా నివేదికలను ఆధారంగా చేసుకుని పోషక నిర్వహణ చేపట్టాలని సూచించారు. డా. ఎన్. సతీబాబు మాట్లాడుతూ, పంట అవశేషాలను కాల్చకుండా వాటిని భూమిలో కలపడం, పచ్చి ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడం ద్వారా నేల జీవక్రియలు మెరుగుపడతాయని వివరించారు. డా. చి. సీతారామలక్ష్మి మాట్లాడుతూ, నేలలో సేంద్రియ కార్బన్ శాతాన్ని పెంచడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం, పోషకాల లభ్యత మెరుగుపడి పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని తెలిపారు. డా. డి. ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, సమీకృత పోషక నిర్వహణ (ఇంటిగ్రాటెడ్ న్యూట్రింట్ ) పద్ధతులను అవలంబించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, దీర్ఘకాలికంగా నేల సారాన్ని సంరక్షించవచ్చని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ, రైతులు నేల పరీక్షలు చేయించుకొని, శాస్త్రవేత్తల సూచనల మేరకు పోషక నిర్వహణ చేపట్టాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులతో శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా చర్చించి, నేల ఆరోగ్యం, పోషక నిర్వహణ మరియు సుస్థిర వ్యవసాయంపై వారి సందేహాలను నివృత్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *