ప్రకృతి వ్యవసాయమే రైతులకు సుస్థిర భవిష్యత్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్

* రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తాం * జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతుల సమ్మేళనం – ప్రకృతి వ్యవసాయ విస్తరణకు పిలుపు

పయనించే సూర్యుడు / జూన్ 12 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో “ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఇకనైనా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు మద్దతు ధర లభించదనే ఆందోళన అవసరం లేదని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. మోదీ 4,400 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన స్ఫూర్తితో రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు గోమాత, భూమాత, భారతమాత నినాదంతో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం గత మూడు సంవత్సరాలుగా 19 గ్రామాల్లో 6,018 మంది రైతులతో కలిసి 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ విస్తీర్ణాన్ని 50 వేల ఎకరాలకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేవీకే నిర్వాహకులు, శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌, ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం భూమి పూజ నిర్వహించి మొక్క నాటారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రు నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కేవీకే వ్యవస్థాపక సభ్యుడు విజయపాల్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్ రావు, కిసాన్ మోర్చా నాయకులు మహిపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *