పయనించే సూర్యుడు / జూన్ 13 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సభ ప్రాంగణం బీఆర్ఎస్ శ్రేణులతో కిక్కిరిసిపోగా, కార్యకర్తల నినాదాలతో సమావేశం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, అధికార మార్పిడి తర్వాత కొందరు కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు బీఆర్ఎస్ కార్యకర్తల పాత్ర అమూల్యమని, వారి త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించిన ఆయన, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించి తెలంగాణను మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని, రైతులు, యువత, మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, తన కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేశామని తెలిపారు. 127 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించి నాయకులుగా నిలబెట్టామని చెప్పారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల విజయానికి కూడా కార్యకర్తలే ప్రధాన కారణమని కొనియాడారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ రద్దుకు సంబంధించిన అధికారిక రిటన్ కాపీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన, లేకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ₹1,001 కోట్లు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు టీ జీవన్ రెడ్డి, సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్చార్జ్ రాకేష్ రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్తో పాటు పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.