పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 14 వత్సవాయి, గ్రామంలో ని ఈరోజు న ప్రాణాలు కాపాడాలని పోలీస్ స్టేషన్కు వెళ్లిన యువ దంపతులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వారినే అవమానించిన ఘటన వత్సవాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దంపతుల పట్ల వత్సవాయి ఎస్సై అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే ఫిర్యాదు తీసుకుంటాం…లేకపోతే బయటకు వెళ్లండి అంటూ ఎస్సై నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు బాధితులు వాపోతున్నారు. ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించిన వారిని కనీసం మానవత్వంతో వినకుండా అవమానకరంగా మాట్లాడటం పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం మేజర్ వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో వివాహం చేసుకోవడం నేరం కాదు. అలాంటి జంటలకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత. అయితే వత్సవాయి పోలీసుల తీరు మాత్రం రక్షణ కోసం వచ్చిన వారినే బెదిరించేలా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్న దంపతుల ఫిర్యాదును స్వీకరించకుండా మ్యారేజ్ సర్టిఫికెట్ పేరుతో తప్పించుకోవడం వెనుక కారణాలేమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైనా అపరిస్థితి జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి సంబంధిత ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత దంపతులకు తక్షణ రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.