నాగులవంచ బాలుర వసతి గృహంలో అడ్మిషన్లు ప్రారంభం

పయనించే సూర్యుడు జూన్ 15,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సమీకృత బాలుర వసతి గృహం, నాగులవంచలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు వసతి గృహ సంక్షేమ అధికారి కొత్త వెంకటేశ్వరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఓసీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు మూడవ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వసతి, భోజన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులను కోరారు. వసతి గృహంలో చేరిన విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహార భోజనం, నాలుగు జతల దుస్తులు, నోట్‌బుక్స్, పదో తరగతి స్టడీ మెటీరియల్, బ్లాంకెట్, కార్పెట్, స్వెటర్, బ్లాక్ షూ, స్పోర్ట్స్ షూ, స్కూల్ బ్యాగ్, ప్లేట్, గ్లాస్, ట్రంక్ బాక్స్ వంటి సౌకర్యాలు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏడవ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.150, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.200 చొప్పున సబ్బుల ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అదనంగా లైబ్రరీ, క్రీడా సామగ్రి, ప్రతినెల వైద్య పరీక్షలు, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ట్యూటర్ల సేవలు, విద్యార్థుల నిద్ర కోసం మంచాలు వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించామని పేర్కొన్న ఆయన, తల్లిదండ్రులు తమ పిల్లలను వసతి గృహంలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం: 9440581134 నంబర్‌ను సంప్రదించాలని వసతి గృహ సంక్షేమ అధికారి కొత్త వెంకటేశ్వరరావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *