ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి: డ్యాగ అనిల్ కుమార్

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

పయనించే సూర్యుడు జూన్ 15 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్, జూన్ 14: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగ అనిల్ కుమార్ ఆరోపించారు. ప్రతి సంవత్సరం ఎలాంటి నియంత్రణ లేకుండా ఫీజులను పెంచుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా, ప్రత్యేక కోచింగ్, డిజిటల్ క్లాసుల పేరుతో విద్యార్థుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కొంతమంది యాజమాన్యాలు 6వ తరగతి నుంచే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరుతో విద్యార్థులపై అధిక ఒత్తిడి పెంచి వారి బాల్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విద్యా మాఫియాను ప్రభుత్వం ఉపేక్షించరాదని, సమస్య పరిష్కారం కాకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడిలు చేపడతామని డ్యాగ అనిల్ కుమార్ హెచ్చరించారు. విద్య హక్కు మాత్రమేనని, దానిని వ్యాపారంగా మార్చడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *