అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

అశ్వారావుపేటలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ – మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు

పయనించే సూర్యుడు న్యూస్ జులై 3 అశ్వారావుపేట, మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి రమేష్ బాబు లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి ఈ హక్కు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులు రేషన్ కార్డులకు దూరమయ్యారని, దరఖాస్తులు చేసినప్పటికీ సంవత్సరాల తరబడి కార్డులు మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులను గుర్తించి పెద్దఎత్తున కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హులైన ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లక్ష్యమని జూపల్లి రమేష్ బాబు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రేషన్ కార్డులు లేని అర్హ కుటుంబాలు ఇకపై ప్రభుత్వ సంక్షేమానికి దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు తమకు సంబంధించిన సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉందన్నారు. రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమకు రేషన్ కార్డులు అందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందగలమని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ నాయకుడు జూపల్లి ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నండ్రు రమేష్, అల్లాడి వెంకట రామారావు, కౌన్సిలర్లు మిండా హరిబాబు, తిరుమలశెట్టి వెంకన్నబాబు, నార్లపాటి దివాకర్, షేక్ సైదు బాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *