ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశ భవిష్యత్తు

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 03 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎర్రవరంలో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయుల యన్.కన్నబాబు అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ రేమల్లి సౌజన్య విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ,సమతుల్య ఆహారం, మంచి ఆహారపు అలవాట్లు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. అలాగే ఇంటి వద్ద,పాఠశాలలో గ్రామంలోని కూడళ్లలో చేపట్టవలసిన పరిశుభ్రత కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సుభద్ర, ఆశా వర్కర్లు కుమారి, భవాని పాల్గొని విద్యార్థులకు ఆరోగ్య సూచనలు అందించారు. అనంతరం విద్యార్థులందరికీ ఐరన్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు యన్.కన్నబాబు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం. విద్యార్థులు విద్యలో రాణించాలంటే ముందుగా ఆరోగ్యవంతులుగా ఉండాలి. మంచి ఆరోగ్య అలవాట్లను అలవరచుకొని పరిశుభ్రమైన పరిసరాలను కాపాడేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా కృషి చేయాలి.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైనది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *