పయనించే సూర్యుడు జూలై 5, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. అదే సమయంలో దుర్యోధన యువరాజు రాజ్యాంగంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని మండిపడ్డారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పాలనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (మావిగన్) రాజధాని ప్రతిపాదనపై కూటమి ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందని నిలదీసారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకోవడం వల్ల కొత్త రాజధాని నిర్మాణ భారాన్ని తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి వంటి మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ వ్యయం తగ్గి, ప్రజాధనం విద్య, వైద్యం వంటి రంగాలకు మళ్లించవచ్చని తెలిపారు. విజయవాడ, గుంటూరు వంటి నగరాలు ఇప్పటికే పరిపాలనకు అనుకూలంగా ఉన్నందున రాజధాని ఏర్పాటు త్వరగా సాధ్యమవుతుందని, గన్నవరం విమానాశ్రయం విస్తరణతో అంతర్జాతీయ విమాన సర్వీసులు, కార్గో హబ్, ఎంఆరఓ వంటి సదుపాయాలకు అవకాశం పెరుగుతుందని చెప్పారు. అలాగే మచిలీపట్నం పోర్టు అభివృద్ధి ద్వారా ఎగుమతి-దిగుమతి, లాజిస్టిక్స్, పరిశ్రమల వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. మూడు నగరాల మధ్య రహదారి, రైలు, మెట్రో వంటి రవాణా వ్యవస్థలు అభివృద్ధి చెందితే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను వినియోగించుకుని తక్కువ వ్యయంతో దశలవారీగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చనే వాదన మావిగన్ ప్రతిపాదనకు అనుకూలంగా ఉందని నాగమణి పేర్కొన్నారు.