పయనించే సూర్యుడు మే 28 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కూటమి అవినీతి పాలనతో విసిగిపోయారు సమిష్టిగా కృషి చేసి మన ప్రభుత్వం తెచ్చుకోవాలి ఇటివల జరిగిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించిన ఓట్లతోనే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు సైతం ఓటమి పాలయ్యే పరిస్థితి వచ్చిందని, అర్సులైన ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు చూడాలని, ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, జిల్లా బూత్ కమిటిల అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డిలతో కలసి బుధవారం ఆత్మకూరు నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ పై పూర్తిస్థాయిలో ఎల్ఈడి ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ 23 సంవత్సరాల అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.పార్టీ తరపున బూత్ లెవల్ ఏజెంట్లుగా నియమితులైన వారు బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకుని అర్హులైన వారు, పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించనివ్వకుండా చూడాలని, ముందుగానే ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బూత్ లెవల్ ఏజెంట్లకు స్థానిక నాయకత్వం పూర్తి సహకారం అందించాలని, తద్వారా పార్టీ సానుభూతి ఓట్లు, అర్హులైన మన వారి ఓట్లు తొలగింపులు జరగకుండా ఉంటాయని, అందరూ ఈ 45 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల వరకు ఎదురుచూశామని, అయితే ప్రజాసంక్షేమాన్ని మరచిన కూటమి ప్రభుత్వం అవినీతికి, స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ సాగిందని అన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు అభివృద్దిని చూపించకుండా అవినీతిని, అప్పులను పరిచయం చేసిందని, దీని ద్వారా భవిష్యత్తు తరాలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సైతం కూటమి నాయకులే ప్రస్తుత పాలకుని మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులన్ని ఇప్పుడు పుస్తకంగా మారాయని, అభివృద్ది మాటేమో కానీ దోపిడి, అవినీతి నియోజకవర్గంలో కొనసాగుతుందని, దాదాపు రూ.300 కోట్ల మేర అవినీతి జరిగిందంటే రాష్ట్రం మొత్తం మీద కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో స్పష్టమవుతుందన్నారు. ప్రజలు ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీకి, జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారని, అందరం సమిష్టిగా కృషి చేస్తే మళ్లీ ప్రజల అభీష్టం మేరకు మన ప్రభుత్వం వస్తుందని, ఆ దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు.