సేవా రంగంలో వీరణాల నాగు మానవత్వం.. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం

* బాధితులకు దాతల సహకారంతో ఆర్థిక సాయం అందిస్తున్న వీరణాల నాగు * అవసరమైన చోట ముందుండి సహాయం అందిస్తూ సేవాభావం చాటుతున్న నాగు * డేగల రాము సహకారంతో అత్యవసర రక్తదాన సేవలు * “మనిషికి మనిషే తోడు” అనే భావనతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న నాగు

పయనించే సూర్యుడు న్యూస్ మే 28 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన ప్రముఖ ఆటో మెకానిక్ వీరణాల నాగు తన సేవా కార్యక్రమాలతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో బాధితులకు దాతల సహకారాన్ని సమీకరించి, వారికి అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్నారు. ప్రమాదాలు, అనారోగ్యాలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు స్వయంగా ముందుండి దాతల ద్వారా సహాయం అందించడం వీరణాల నాగు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించి, సోషల్ మీడియా స్టేటస్‌లు, స్నేహితులు మరియు పరిచయాల ద్వారా విరాళాలు సేకరించి బాధితులకు అందజేస్తున్నారు. కుడిచేయి కోల్పోయిన మహిళకు లక్ష రూపాయల సహాయం ఆటో మరియు ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుడిచేయిని కోల్పోయిన ఓ నిరుపేద మహిళ చికిత్స కోసం దాతల సహకారంతో సుమారు రూ.1 లక్ష సేకరించి అందజేశారు. ఈ సాయం బాధిత కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడికి రూ.75 వేల ఆర్థిక అండ చెట్టుపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన ఓ యువకుడి చికిత్స కోసం దాతల ద్వారా రూ.75 వేల సహాయం అందేలా నాగు కృషి చేశారు. ఆసుపత్రి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ఈ సాయం ఎంతో ఉపయోగపడింది. అగ్ని ప్రమాద బాధితురాలికి తక్షణ సహాయం అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళకు అత్యవసర అవసరాల కోసం దాతల సహకారంతో రూ.7 వేల సాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండ కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ బాలుడి వైద్య ఖర్చుల కోసం దాతల ద్వారా రూ.30 వేల సహాయం అందించారు. బాలుడి కుటుంబ సభ్యులు నాగుకు కృతజ్ఞతలు తెలిపారు. కామయ్యపాలెం మహిళకు దాతల సహాయం కామయ్యపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుండగా, దాతల సహకారంతో రూ.10,100 సేకరించి అందజేశారు. రక్తదానంలోనూ ముందుండే సేవాభావం ఆర్థిక సహాయంతో పాటు రక్తదాన కార్యక్రమాల్లో కూడా వీరణాల నాగు చురుకుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైతే, డేగల రాము సహకారంతో వెంటనే స్పందించి అవసరమైన బ్లడ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ పలువురి ప్రాణాలను కాపాడుతున్నారు. ఆసుపాక పాఠశాల అభివృద్ధికి నాగు, కరీం కృషి ఆసుపాక పాఠశాలలో వసతుల కొరతను గమనించిన నాగు, కరీం గ్రామస్తులు మరియు దాతలను సమన్వయం చేసి సుమారు రూ.4 లక్షల విరాళాలను సేకరించారు. ఈ నిధులతో పాఠశాల క్రీడా మైదానాన్ని మట్టితో చదును చేయించి ఆటలకు అనువుగా తీర్చిదిద్దడమే కాకుండా, విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం కొత్త మోటార్‌ను బిగించి, ఆవరణలో వాటర్ టాప్‌లను ఏర్పాటు చేయించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం స్టేజ్ సౌకర్యాన్ని కూడా మెరుగుపరిచారు. ఈ సందర్భంగా వీరణాల నాగు మాట్లాడుతూ, “నాపై నమ్మకం ఉంచి నేను స్టేటస్ పెట్టిన వెంటనే స్పందిస్తున్న దాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బాధితులు మరియు దాతల మధ్య వారధిలా ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది” అని తెలిపారు. స్వయంగా డబ్బులు ఇవ్వకపోయినా, అవసరమైన సమయంలో ముందుండి దాతలను సమీకరించి బాధితులకు సహాయం అందించడం ద్వారా వీరణాల నాగు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆయన సేవా తత్వాన్ని అశ్వారావుపేట మండల ప్రజలు, యువత మరియు పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *