పయనించే సూర్యుడు, జూన్ 2 (నిర్మల్ జిల్లా ): ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామ పంచాయతీ పరిధిలోని ఇప్పమడ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల వీచిన గాలి దుమారానికి విద్యుత్ తీగలు తెగి నేలపై పడగా, మేతకు వెళ్లిన రెండు ఎడ్లు వాటిని తాకి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. మృతిచెందిన ఎడ్లు వెడ్మ మాణిక్‌రావు, మెస్రం సతేన్నలకు చెందినవిగా గుర్తించారు. ఒక్కో ఎద్దు విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని, మొత్తం రూ.1.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వెటర్నరీ సిబ్బంది రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. అనంతరం సంబంధిత వివరాలను నమోదు చేసి సంబంధిత అధికారులకు నివేదిక అందజేశారు. ఈ ఘటనతో బాధిత రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.