గ్రామపంచాయతీలో ఘనంగా వన మహోత్సవం

* మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ఎంపీడీఓ శైలజ రాణి, సర్పంచ్ చిందం మహేష్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -07: వన మహోత్సవాన్ని పురస్కరించుకుని రామగిరి మండలంలోని పన్నూర్ గ్రామపంచాయతీ ఆవరణలో సోమవారం సర్పంచ్ చిందం మహేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగిరి మండల ఎంపీడీఓ శైలజ రాణి పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కంటికి రెప్పలా సంరక్షించాలని సూచించారు.సర్పంచ్ చిందం మహేష్ మాట్లాడుతూ వన మహోత్సవం వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం తమ బాధ్యతగా భావించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రామగిరి ఈసీ మౌనిక, టీఏ అఖిల, పన్నూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రేమలత, వార్డు సభ్యులు ప్రదీప్, అరుణ, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *