చింతకానిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మిక పర్యటన

పయనించే సూర్యుడు జూన్ 12 (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రతినెల నిర్వహించే ఆశా డే కార్యక్రమానికి హాజరైన ఆయన, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా త్వరలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే “డ్రై డే–ఫ్రైడే” కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తూ గృహ సందర్శనలు నిర్వహించాలని, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి లార్వా పెరుగుదలను అరికట్టే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలని వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్‌కు సూచించారు. అలాగే ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్న “స్టాప్ డయేరియా” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *