జహీరాబాద్–బీదర్ రోడ్డు ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలి: మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం డిమాండ్

పయనించే సూర్యుడు,జూన్ 16 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్–బీదర్ రహదారి అధ్వాన్న పరిస్థితుల కారణంగా ఈ రోజు మరో అమాయక ప్రాణం రోడ్డు ప్రమాదంలో బలికావడం అత్యంత విషాదకరమని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై భారీ గుంతలు ఏర్పడి రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ప్రజలు నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితమే తాము స్వయంగా జహీరాబాద్–బీదర్ రహదారిని పరిశీలించి దాని దయనీయ పరిస్థితిని వీడియోలు మరియు ఫోటోల ద్వారా ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి మరియు ప్రజలకు తెలియజేశామని గుర్తు చేశారు. ఈ విషయమై సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని, అప్పట్లో రహదారి మరమ్మతుల పనులను వెంటనే చేపట్టి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం వల్లే ఈ రోజు ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తి నిండు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఇది తీవ్రంగా ఖండించదగిన విషయమని విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, కాబట్టి మృతుడి కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై తక్షణమే కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇకనైనా జహీరాబాద్–బీదర్ రహదారి మరమ్మతులను అత్యవసరంగా వెంటనే పూర్తి చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వై. నరోత్తం డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *