తల్లాడ మండలంలో టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0 కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ :మే 21, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామపంచాయతీలో ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ సుబ్బారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, తెలంగాణను క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీబీ సూపర్వైజర్ వై. సురేష్ మాట్లాడుతూ, గ్రామాల్లో నిర్వహిస్తున్న క్షయ నిర్ధారణ శిబిరాలు, పోర్టబుల్ (హ్యాండ్హెల్డ్) ఎక్స్‌రే సేవల గురించి ప్రజలకు వివరించారు. క్షయ వ్యాధిపై అపోహలు వీడి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పడటం, అలసట, మెడ లేదా చంకల్లో గడ్డలు, దగ్గుతో రక్తం రావడం, ఛాతినొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాంపుకు వచ్చిన ప్రజలకు హ్యాండ్హెల్డ్ ఎక్స్‌రేలు నిర్వహించి, కఫం (కళ్ళె) నమూనాలు సేకరించారు. క్షయ వ్యాధికి సంబంధించిన పరీక్షలు, మందులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. టీబీ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ పద్మ, హెచ్‌వీ ఝాన్సీ, ఆశ కార్యకర్తలు కుమారి, రేణుక, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *